Narendra Modi: మారిషస్, శ్రీలంక దేశాధినేతలతో మాట్లాడిన ప్రధాని మోదీ
- కరోనాతో యావత్ ప్రపంచం విలవిల
- అనేక దేశాధినేతలతో మాట్లాడుతున్న మోదీ
- తాజాగా పొరుగు దేశాల అధినాయకత్వంతో పరిస్థితులపై చర్చ
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర దేశాల అధినేతలతో మాట్లాడుతూ వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్సలతో మాట్లాడారు.
మారిషస్ లో విజయవంతంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నారంటూ ప్రవింద్ జగన్నాథ్ ను అభినందించారు. మన రెండు దేశాల ప్రజలు పంచుకుంటున్న సంస్కృతి, విలువల ఆధారంగా, ఇరు దేశాల ప్రజలు కూడా సౌభ్రాతృత్వం, ప్రత్యేక బంధాలను పంచుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విపత్కర సమయంలో భారతీయులు మారిషస్ సోదర, సోదరీమణులకు అండగా నిలుస్తారని ఉద్ఘాటించారు.
ఇక, శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్సతో సంభాషణ గురించి చెబుతూ, తమ మధ్య జరిగిన చర్చ అద్భుతంగా సాగిందని తెలిపారు. రాజపక్స నాయకత్వంలో కరోనాతో శ్రీలంక పోరాటం అద్వితీయ రీతిలో సాగుతోందని ప్రశంసించారు. పొరుగుదేశానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని, కరోనాతో ప్రభావితమైన లంక ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉంటుందని తెలిపారు. భారత భాగస్వామ్యంతో శ్రీలంకలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసేందుకు అంగీకారం కుదిరిందని మోదీ వెల్లడించారు.