Sramik Train: శ్రామిక్ రైల్ లో పుట్టిన బిడ్డకు 'లాక్ డౌన్ యాదవ్' అని పేరు పెట్టిన తల్లి!
- ముంబై నుంచి యూపీకి బయలుదేరిన జంట
- మార్గమధ్యంలో పురిటి నొప్పులు
- విషయం తెలుసుకుని స్పందించిన అధికారులు
ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్ లోని తన స్వస్థలానికి బయలుదేరిన ఓ మహిళకు, రైల్లో పురిటి నొప్పులు ప్రారంభమై, మగ బిడ్డను కని, ఆ బిడ్డకు లాక్ డౌన్ యాదవ్ అని పేరు పెట్టింది. ఆసక్తికరమైన ఈ ఘటనకు చెందిన మరిన్ని వివరాల్లోకి వెళితే, స్వస్థలానికి ఉదయ భాన్ సింగ్, రీనా దంపతులు రైలులో బయలుదేరారు. శుక్రవారం రాత్రి సమయంలో నెలలు నిండిన రీనాకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా, సాయం చేయాలంటూ ఉదయభాన్ సింగ్, రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా వారు వెంటనే స్పందించారు. రైలును బుర్హాన్ పూర్ లో ఆపి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఆమె మగ శిశువును ప్రసవించింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ సమయంలో పుట్టినందున అతనికి లాక్ డౌన్ యాదవ్ అని పేరును పెట్టామని రీనా వెల్లడించారు. తాము ముంబై నుంచి అంబేద్కర్ నగర్ కు వెళ్లాల్సి వుందని, మధ్యలోనే నొప్పులు వచ్చాయని, విషయం తెలుసుకుని సాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలని ఆమె తెలిపారు.