Janasena: టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, జనసేన సంయుక్త నిరసనలు
- టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన
- అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని పవన్ పిలుపు
- భౌతికదూరం పాటిస్తూ నిరసనల్లో పాల్గొనాలని సూచన
టీటీడీ భూముల విక్రయం అంశంపై తమ పంథాను జనసేన పార్టీ అధినాయకత్వం వెల్లడించింది. టీటీడీ ఆస్తుల విక్రయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, మంగళవారం బీజేపీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని, టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో బీజేపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలిపేందుకు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఈ మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్టు ఆ ప్రకటనలో వివరించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.
దీనిపై పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినందున ఏడాది వరకు నిరసనల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నామని, అయితే ఈ ప్రభుత్వం కొద్దికాలంలోనే ప్రజా వ్యతిరేక పాలన చేస్తుండడంతో ఎప్పటికప్పుడు తగు రీతిలో స్పందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు బీజేపీతో నిరసనల్లో పాల్గొనడం కూడా ఇలాంటిదేనని, అయితే, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టుగా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని, నిరసనల్లో కలిసి కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత జిల్లాల్లో పర్యటనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.