Telugudesam: టీడీపీ మహానాడు... తొలిరోజు చర్చించే అంశాలు!
- నేటి నుంచి రెండు రోజుల పాటు మహానాడు
- ఆన్ లైన్ మాధ్యమంగా కార్యక్రమం
- తొలి రోజున వైసీపీ వైఫల్యాలపై చర్చలు
నేటి నుంచి రెండురోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి, ఆపై ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆన్ లైన్ మాధ్యమంగా మహానాడు జరగనుంది. దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇక తొలి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు.
ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి.