Roja: నవ్వుతూ వినతి పత్రాన్ని తీసుకున్న రోజా.. వివాదం ముగిసినట్టేనా?
- డిప్యూటీ సీఎం నారాయణస్వామితో వివాదం
- రోజాను పిలవకుండానే ఆమె నియోజకవర్గంలో స్వామి సమీక్ష
- ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా
చిత్తూరు జిల్లా వైసీపీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. నగరి నియోజకవర్గం పుత్తూరులో ఆమెను పిలవకుండానే నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
అయితే, ఇదే కార్యక్రమానికి నగరి నియోజకవర్గంలో రోజాకు వైరి పక్షమైన వైసీపీకే చెందిన కేజే కుమార్ వర్గీయులు హాజరయ్యారు. దీంతో, రోజా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. డిప్యూటీ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా దీటుగానే ప్రతిస్పందించారు. తాను డిప్యూటీ సీఎం అని... తనకు రోజా పర్మిషన్ అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే, ఈ అంశంపై పార్టీ అధిష్ఠానానికి రోజా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితులు మారినట్టు కనిపిస్తున్నాయి. రోజాను పుత్తూరు అంబేద్కర్ ట్రస్టు సభ్యులు కలిశారు. కల్యాణమంటపం నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రాన్ని అందించారు. అంతేకాదు, తమకు కూడా ఇళ్ల స్థలాలను ఇప్పించాలని కోరారు.
ఈ సందర్భంగా వారితో రోజా మాట్లాడుతూ, ఏం తప్పు చేశానని తనను పిలవలేదని ప్రశ్నించారు. ఎస్సీలకు కల్యాణమంటపం కడితే తనకు కూడా సంతోషమేనని చెప్పారు. తనను కూడా పిలిచి ఉంటే గౌరవంగా ఉండేదని అన్నారు. దీంతో, పరిస్థితి మారినట్టేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.