Balakrishna: బాలయ్యకు అవమానం జరిగితే నేనే ఒప్పుకోను: సి.కల్యాణ్
- టీఎస్ ప్రభుత్వంతో జరిగింది నిర్మాతల సమావేశం
- అవసరమైనప్పుడు పిలవండి వస్తానని బాలయ్య చెప్పారు
- 'సీసీసీ'కి చిరంజీవిని లీడ్ గా పెట్టుకున్నాం.. బాలయ్య తొలి చెక్ ఇచ్చారు
షూటింగులను పునఃప్రారంభించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినీ పెద్దలు చర్చలు జరిపిన సంగతి తనకు తెలియదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలపై నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు.
నిన్నటి దాకా దాసరి నారాయణరావు అన్ని బాధ్యతలను భుజాన వేసుకునేవారని... ఇప్పుడు చిరంజీవిని తాము పిలిచామని కల్యాణ్ తెలిపారు. నాగార్జున కూడా వచ్చారని... అవసరమైతే పిలవండి వస్తానని బాలయ్య కూడా తనతో చెప్పారని అన్నారు. ఎక్కడ ఎవరు అవసరమైతే... అక్కడకు వారిని తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సినిమాలకు సంబంధించి పనులు జరగడమే తమకు ముఖ్యమని, తాము ఏ పార్టీలకూ సంబంధించిన వారం కాదని అన్నారు. తామంతా తెలుగు సినిమావాళ్లమని చెప్పారు.
చిరంజీవి వాళ్ల సినిమా షూటింగ్ కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిందని... అందువల్ల వారి సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఎప్పుడు ఇస్తారని అడగడానికి ఆయన వచ్చారని కల్యాణ్ తెలిపారు. తమ హీరో బాలయ్యేనని... ఇక్కడ జరిగినవన్నీ ఆయనకు తాను చెప్పానని అన్నారు. చర్చలకు మిమ్మలను పిలవలేదా? అని మీడియా ఆయనను అడిగిందని... అందుకే తనకు తెలియదు, పేపర్లో చూసి తెలుసుకున్నానని ఆయన సరదాగా చెప్పారని తెలిపారు. వాస్తవానికి ఇది ఆర్టిస్టులను పిలిచే మీటింగ్ కాదని... నిర్మాతలకు సంబంధించిన మీటింగ్ అని చెప్పారు. గతంలో అనేక విషయాల్లో బాలయ్యను ముందు పెట్టామని గుర్తు చేశారు.
'సీసీసీ'కి చిరంజీవిని లీడ్ గా పెట్టుకున్నామని... ఆ విషయాన్ని బాలయ్యకు తానే చెప్పానని... చాలా మంచి పని చేస్తున్నారని బాలయ్య కితాబివ్వడమే కాకుండా... తొలి చెక్కును అందించారని కల్యాణ్ చెప్పారు. బాలయ్యకు ఏదో జరిగిందని చెప్పుకుంటున్నారని... ఆయనకు ఏదైనా అవమానం జరిగితే తానే ఒప్పుకోననని అన్నారు.