YV Subba Reddy: టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని తీర్మానం చేశాం: వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ ఆస్తుల అమ్మకంపై తీవ్ర దుమారం
- టీటీడీ, సర్కారు తీరుపై విపక్షాల ధ్వజం
- నిలుపుదల చేస్తూ జీవో ఇచ్చిన సర్కారు
- సీఎం నిర్ణయానికి అనుగుణంగా తీర్మానం చేశామన్న వైవీ
ఇటీవల టీటీడీ ఆస్తుల విక్రయం అంశం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో సైతం నిరసనలు తెలిపేందుకు విపక్షాలు సిద్ధపడ్డాయి. ప్రతికూల స్పందనలతో వెనుకంజ వేసిన సర్కారు టీటీడీ ఆస్తుల విక్రయం నిలుపుదల చేస్తూ జీవో జారీ చేయగా, తాజాగా టీటీడీ పాలకమండలి కూడా ఆస్తులు అమ్మరాదంటూ తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ భూములు, ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా టీటీడీ కూడా దీనిపై తీర్మానం చేసిందని వివరించారు.
"టీటీడీ భూములు అమ్మాలని గత పాలకమండలి తీర్మానం చేసింది. దాన్ని మేం తిరస్కరిస్తూ తాజా తీర్మానం చేశాం. టీటీడీ ఆస్తులు, శ్రీవారి ఆస్తులు, భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తుల్లో వేటినీ అమ్మబోం" అని వైవీ స్పష్టం చేశారు. భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, నిరుపయోగంగా పడివున్న ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేస్తామని, ఇందులో టీటీడీ బోర్డు సభ్యులు, ప్రముఖ స్వామీజీలు, భక్తులు కూడా సభ్యులుగా ఉంటారని తెలిపారు.