Karnataka Bank: ఖాతాదారులను దోచేస్తున్న కర్ణాటక బ్యాంక్.. ఈఎంఐ కట్టనందుకు ఏడురెట్ల జరిమానా
- రూ. 30 వేలు రుణం తీసుకున్న బాధితుడు
- లాక్డౌన్ కారణంగా చెల్లించలేకపోయిన వైనం
- రూ. 590 చొప్పున ఏడు రెట్ల జరిమానా విధించి బ్యాంకు
ఈఎంఐ చెల్లించలేదన్న కారణంతో కర్ణాటక బ్యాంకు ఖాతాదారులకు ఏడు రెట్ల జరిమానా విధించడం వివాదాస్పదమైంది. ఈఎంఐ చెల్లింపులను కేంద్రం వాయిదా వేసినప్పటికీ సదరు బ్యాంకు మాత్రం ఏకంగా ఏడురెట్ల మొత్తాన్ని జరిమానా విధించడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులను బ్యాంకు దోపిడీ చేస్తోందని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు చెందిన బాధితుడు సంగమేశ్ హడపద కర్ణాటక బ్యాంకులో రూ. 30 వేలు రుణం తీసుకున్నాడు.
కరోనా లాక్డౌన్ కారణంగా ఒక నెల వాయిదాను చెల్లించలేకపోయాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో బ్యాంకు రూ.4,150 జరిమానా విధించింది. దీంతో సంగమేశ్ షాకయ్యాడు. వెంటనే బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయాడు. తాను నెలకు రూ. 3 వేలు చెల్లించేవాడినని, కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపారం సరిగా సాగక చెల్లించలేకపోయానని చెప్పాడు. ఈఎంఐ చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేసినా బ్యాంకు భారీ మొత్తంలో జరిమానా విధించడం అన్యాయమని సంగమేశ్ వాపోయాడు.