India: చైనాకు దూకుడుగానే బదులివ్వాలని భారత సైన్యం కీలక నిర్ణయం
- ఢిల్లీలో అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్ల భేటీ
- మూడు రోజుల పాటు జరిగిన సమావేశం
- చైనాతో సరిహద్దుల వద్ద తాజా పరిస్థితులపై కీలక చర్చలు
- చైనా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని నిర్ణయం
లడఖ్‌లో సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశ సైన్యానికి దీటుగా బదులిచ్చే క్రమంలో భారత్ ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. చైనాతో దూకుడుగానే వ్యవహరించాలని భారత సైన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఢిల్లీలో అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్లు మూడు రోజుల పాటు సమావేశమై చైనాతో సరిహద్దుల వద్ద తాజా పరిస్థితులపై కీలక చర్చలు జరిపారు. సరిహద్దుల వద్ద చైనా బలగాలు పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో భారత సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది.
చైనాతో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలతో పాటు, జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులు, పలు సున్నిత అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం అగ్రశ్రేణి కమాండర్లు ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో పూర్తి వివరాలు వెల్లడించలేదు.
సరిహద్దులోని పాంగాంగ్ సో సరస్సు, గాల్వన్ లోయ, డెమ్‌చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద భారత సైన్యాన్ని మోహరించి, చైనాకు గట్టిగా బదులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మాత్రం తెలిసింది. చైనా తన సైన్యాన్ని మోహరించి చేస్తోన్న ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని నిర్ణయం తీసుకుంది.