Border: సరిహద్దుల్లో పుట్టి 'బోర్డర్' అయ్యాడు!
- భారత్, నేపాల్ సరిహద్దుల్లో శిశువు జననం
- నేపాల్ నుంచి భారత్ వస్తున్న గర్భవతి
- సరిహద్దు వద్ద నొప్పులు మొదలవడంతో అక్కడే ప్రసవం
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన చిన్నారులకు సమయానుకూలంగా నామకరణం చేయడం తెలిసిందే. ఇటీవల కరోనా నేపథ్యంలోనూ ఇలాంటి పేర్లు చూశాం. లాక్ డౌన్ అని, శానిటైజర్ అని పిల్లలకు పేర్లు పెట్టారు. తాజాగా, భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. సరిహద్దుల్లో పుట్టాడు కాబట్టి ఆ మగశిశువుకు 'బోర్డర్' అని నామకరణం చేశారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన జమ్తారా అనే మహిళ తన భర్తతో కలిసి నేపాల్ లోని ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తోంది. ఆమె నిండు గర్భవతి. కరోనా విజృంభించడంతో నేపాల్ లోనూ లాక్ డౌన్ విధించారు. దాంతో తమ స్వస్థలం మహరాజ్ గంజ్ కు తిరిగి వచ్చే క్రమంలో నేపాల్ సరిహద్దులోని సోనౌలీ ఎంట్రీ పాయింట్ వద్ద ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దాంతో వెంటనే స్పందించిన భర్త ఇతర మహిళల సాయం కోరాడు. వారు ముందుకు రావడంతో అందుబాటులో ఉన్న వస్త్రాలను అడ్డుగా ఉంచి ఆమెకు ప్రసవం చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో 'బోర్డర్' అని అప్పటికప్పుడు నామకరణం చేశారు. ఆపై తల్లీబిడ్డలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.