Devineni Uma: పోలవరం ప్రాజెక్టులో మీ కక్కుర్తి ఏంటి?: దేవినేని ఉమ
- అధికార వైసీపీపై నిప్పులు చెరిగిన ఉమ
- పోలవరంపై గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు
- దమ్ముంటే ఆన్ లైన్ లో వివరాలు పెట్టాలని డిమాండ్
పోలవరం ప్రాజెక్టు అంశంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో జరిగిన పురోగతిని తాము చేసినట్టుగా వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో మీ కక్కుర్తి ఏంటని నిలదీశారు. దమ్ముంటే పోలవరం పనులకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.
తాను 75 సార్లు పోలవరం వెళ్లానని, చంద్రబాబునాయుడు 26 సార్లు పోలవరం వెళ్లారని, సుమారు 105 వారాల పాటు ప్రతి సోమవారం పోలవరం పనులు చూశామని వెల్లడించారు. ఇవాళ వైసీపీ మంత్రులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు.
"దమ్ము, ధైర్యం ఉంటే ప్రాజెక్టుల సమాచారం బయటపెట్టాలి. గత ఐదేళ్లలో పులిచింతలలో ఎంత ఖర్చు చేశామో చెప్పండి. మీ వద్ద అధికారం ఉంది కదా. లెక్కలు బయటికి తీయండి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి మీ కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో వెలుగొండ టన్నెల్ పనులు ఇస్తారా? ఎవరీ కాంట్రాక్టర్ లంకారెడ్డి? సీఎం జగన్ గారూ, లంకారెడ్డి మీకు బంధువా? మిత్రుడా?... ఎవరో చెప్పండి.
న్యాయపరమైన పర్యవేక్షణ ఉంటుందని చెప్పి మీరేం చేస్తున్నారు? నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడమే రివర్స్ టెండరింగా? మీ కడప జిల్లావాడని ఇచ్చారా? లేక, లంకారెడ్డి అని ఇచ్చారా? లేక, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పనులు చేశాడని ఇచ్చారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.