Nara Lokesh: విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ అసమర్థత వల్లే ఇప్పుడు కూడా మరణాలు: లోకేశ్

lokesh on gas leak

  • గొప్పకి పోయి బాధితులు కోలుకోకుండానే బలవంతంగా డిశ్చార్జ్ 
  • ప్రమాదం జరిగిన 25 రోజుల తరువాత కూడా చనిపోతున్నారు
  • కనకరాజు గారి మృతి ప్రభుత్వ హత్యే
  • సరైన వైద్యం అంది ఉంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం అలసత్వంతో పనిచేస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ అసమర్థత వల్లే ఇప్పుడు కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గొప్పకి పోయి బాధితులు కోలుకోకుండానే బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. అందుకే ప్రమాదం జరిగిన 25 రోజుల తరువాత కూడా బాధితులు చనిపోతున్నారు' అని చెప్పారు.
 
'కనకరాజు గారి మృతి ప్రభుత్వ హత్యే. సరైన వైద్యం అంది ఉంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. బాధితులను గాలికి వదిలి కంపెనీ యాజమాన్యానికి జగన్ కొమ్ముకాస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ గొప్ప కంపెనీ అని ప్రభుత్వం కితాబు ఇస్తుంటే ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకైందని ఎన్జీటీ తేల్చింది' అని లోకేశ్ పేర్కొన్నారు. కనకరాజు మృతికి సంబంధించిన వార్తను పోస్ట్ చేశారు.

'ఇప్పటికైనా గ్యాస్ లీకేజ్ ప్రభావం ఉన్న గ్రామాల్లో అందించాల్సిన వైద్య సహాయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్యాస్ ప్రభావంతో సుదీర్ఘ కాలం వచ్చే ఆరోగ్య సమస్యలను అంచనా వేసి సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. గ్యాస్ లీకేజ్ కి కారణమైన కంపెనీ పై కఠిన చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News