Somireddy Chandra Mohan Reddy: జగన్ ప్రభుత్వానికి నా సలహా ఇదే: సోమిరెడ్డి
- కార్యాలయాలపై పార్టీ రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
- వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్న విపక్షాలు
- విలువలు ఉన్నవారు ఎవరైనా రాజీనామా చేస్తారన్న సోమిరెడ్డి
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను నాలుగు వారాల్లోగా తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. లేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మీకు ఈ సలహా ఇచ్చింది బొత్సనా? లేక బుగ్గనా? అంటూ గతంలో తాను ప్రశ్నించిన అంశాన్ని గుర్తు చేస్తూ... తాజాగా సరికొత్త విమర్శలు గుప్పించారు.
'ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేయడంపై హైకోర్టు చీవాట్లు పెట్టినప్పుడే మీ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని చెప్పాము. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మొట్టికాయలు వేసింది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.
విలువలు పాటించే ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే రాజీనామా చేస్తారు. మీరు అలాంటి సంప్రదాయాలు పాటించే వారు కాదు కాబట్టి... ఇప్పటినుంచైనా న్యాయ, రాజ్యాంగ వ్యవస్థలతో క్రీడావినోదం మానుకోవాలని జగన్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.