Barak Obama: "మీ జీవితం ముఖ్యం.. మీ కలలు ముఖ్యం..." ఆందోళనకారులకు బరాక్ ఒబామా వీడియో సందేశం!
- పోలీసుల కస్టడీలో ఫ్లాయిడ్ మృతి
- దేశమంతా వ్యాపించిన నిరసనలు
- యువత తమ భవిష్యత్తుపై దృష్టిని పెట్టాలి
- పోలీసింగ్ విధానంలో సంస్కరణలు రావాలన్న ఒబామా
అమెరికాలోని మిన్నెపోలిస్ పరిధిలో నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్, పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత నెలకొన్న నిరసనలు దేశమంతటికీ వ్యాపించి, తీవ్రరూపం దాల్చిన వేళ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసనకారులు సంయమనం పాటించాలని కోరారు. ఆన్ లైన్ లో నిరసనకారులతో మాట్లాడిన ఆయన, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని, మీకు సేవ చేసి, మిమ్మల్ని రక్షించాల్సిన వ్యక్తుల నుండే తరచుగా హింస ఎదురుకావడం దురదృష్టకరం అని తెలిపారు.
"మీకు మీరు ముఖ్యమని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితాలు ముఖ్యమైనవి, మీ కలలు ముఖ్యమైనవి అని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.. గత కొన్ని వారాలుగా మన జీవితాల్లో ఎన్నో మార్పులను చవిచూశాము. దేశం కూడా మారిపోయింది. ఇంతటి మార్పును నా జీవితంలో నేను చూడలేదు" అంటూ కొవిడ్-19 తీసుకువచ్చిన మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు.
ఓ సమాజంగా దేశంలో వచ్చిన ఈ మార్పు మరింత అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన ఒబామా, స్థానిక అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని, పోలీసింగ్ విధి విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా దేశంలోని ప్రతి మేయర్, తమ ప్రజలతో చర్చించి, సంస్కరణలను అమలు చేయాలని సూచించారు. తన ప్రసంగంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి, ప్రత్యక్షంగా ఒక్క మాటను కూడా ఒబామా ప్రస్తావించక పోవడం గమనార్హం.