George Floyd: పోలీసుల చేతిలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ కు కరోనా పాజిటివ్!
- పోలీసుల చేతిలో మరణించిన ఫ్లాయిడ్
- అప్పటికే అతనిలో కరోనా వైరస్
- లక్షణాలు మాత్రం కనిపించలేదు
- ఇది నరహత్యేనన్న చీఫ్ మెడికల్ ఎగ్జామినర్
అమెరికాలో ఇటీవల శ్వేతజాతి పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ కు కరోనా వైరస్ సోకి ఉందని అతని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ ఫ్లాయిడ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తరువాత, అతని కుటుంబీకుల అనుమతితో 20 పేజీల రిపోర్టును విడుదల చేశారు. కరోనా వైరస్ ఉన్నా, ఫ్లాయిడ్ లో లక్షణాలేవీ బయటకు కనిపించ లేదని, మరణించిన సమయంలో ఆయన ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ తెలియజేశారు.
ఫ్లాయిడ్ మరణించిన తీరును పరిశీలిస్తే, దీన్ని నరహత్యగానే భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మెడపై బలమైన ఒత్తిడి కారణంగానే ఆయన మరణించాడని తెలిపారు. గతంలో అమెరికన్ పోలీసులు ఇచ్చిన నివేదికను ఆయన తప్పుబట్టారు. పోలీసుల నివేదికలో ఫ్లాయిడ్ లో శ్వాసకోశ మాంద్యం, మూర్చ వంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారని గుర్తు చేసిన ఆండ్రూ బేకర్, తమ పరిశీలనలో ఇటువంటివేమీ కనిపించలేదని ఈ రిపోర్టులో వెల్లడించడం గమనార్హం.