Mitron: గూగుల్ ప్లే స్టోర్ లోకి మళ్లీ వచ్చిన 'మిత్రోన్' యాప్
- 'టిక్ టాక్' కు పోటీగా రంగంలోకి 'మిత్రోన్' యాప్
- ఇటీవలే 'మిత్రోన్'ను తొలగించిన గూగుల్
- నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వెల్లడి
చైనా 'టిక్ టాక్' యాప్ కు దీటుగా ఓ భారతీయ సంస్థ తీసుకువచ్చిన 'మిత్రోన్' యాప్ క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది కూడా 'టిక్ టాక్' తరహాలోనే వీడియో మేకింగ్ యాప్. సరిహద్దులో పరిణామాలతో దేశంలో చైనా వ్యతిరేకత పెరిగిపోగా, చైనా వారి 'టిక్ టాక్' కు పోటీగా వచ్చిన మిత్రోన్ విశేషమైన ప్రజాదరణ అందుకుంది.
అయితే, 'మిత్రోన్' యాప్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ గూగుల్ ఇటీవలే తొలగించింది. 'మిత్రోన్' యాప్ డెవలపర్స్ తో కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని గూగుల్ ఇంతకుముందు పేర్కొంది. అయితే, 'మిత్రోన్' యాప్ మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ లో దర్శనమిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్ 5 మిలియన్లకు పైగా డౌన్ లోడ్లు సాధించింది. ఈ యాప్ చూడ్డానికి అచ్చం 'టిక్ టాక్' లాగానే ఉంటుంది. దీని ప్రధాన కేంద్రం బెంగళూరు.