Chiranjeevi: "రాజా.." అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చూశాను: రామానాయుడు జయంతి సందర్భంగా చిరు స్పందన
- నేడు రామానాయుడు జయంతి
- ట్విట్టర్ లో స్పందించిన చిరంజీవి
- కారంచేడు కుర్రాడు అంటూ వ్యాఖ్యలు
- తెలుగు వారందరికీ గర్వకారణమని వెల్లడి
తెలుగు చిత్రసీమలో హీరోలకు దీటైన ఛరిష్మా అందుకున్న ప్రముఖ నిర్మాత రామానాయుడు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి.రామానాయుడు గారిని ఆయన జయంతి రోజున స్మరించుకుంటున్నానని తెలిపారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని, అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
"రాజా..! అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవిచూశాను" అంటూ చిరంజీవి భావోద్వేగాలు ప్రదర్శించారు. కారంచేడు నుంచి ఓ కుర్రాడు దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించడమే కాదు, నిర్మాతగా వరల్డ్ రికార్డు సాధించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. సినిమా అంటే మీకున్న ప్రేమ, సినీ రంగానికి మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.