Revanth Reddy: విద్యుత్ చార్జీల అంశంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కించారన్న రేవంత్
- స్లాబులు మారిపోయాయని వెల్లడి
- ఉపాధి కోల్పోయిన ప్రజలకు షాక్ ఇస్తున్నారని వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక, ఆదాయం రాక కుటుంబాలను పోషించుకోలేకపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ షాక్ ఇస్తున్నారని మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ వినియోగాన్ని కలిపి లెక్కించడంతో స్లాబులు మారిపోతున్నాయని, దీనివల్ల ప్రజలపై మూడు రెట్ల అధిక భారం పడుతోందని ఆరోపించారు.
సాధారణంగా 100 యూనిట్ల స్లాబులో ఉండే వినియోగదారులు ఇప్పుడు 300 యూనిట్ల స్లాబులోకి వచ్చారని వివరించారు. విద్యుత్ చార్జీల మదింపుతో పేద, మధ్య తరగతి ప్రజల జేబుకు ప్రభుత్వం చిల్లు పెడుతోందని తన లేఖలో ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా చూస్తూ ఊరుకోబోమని రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.