Telangana: తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలన్న కేంద్రం
- దేశవ్యాప్తంగా 38 జిల్లాల్లో కరోనా స్వైరవిహారం
- విరివిగా వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ కేంద్రం సూచన
- పటిష్ట నిఘా చర్యలు తీసుకోవాలని వెల్లడి
దేశంలో కరోనా వ్యాప్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా, కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు వెల్లువెత్తుతుండడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి హాట్ స్పాట్లు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 38 జిల్లాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఈ 10 రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని, వైరస్ సంక్రమణం అరికట్టేలా పటిష్టమైన నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటిండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు.