Telangana: అవి నకిలీ లింకులు... క్లిక్ చేయొద్దు: హెచ్చరించిన తెలంగాణ ఇంటెలిజెన్స్
- సోషల్ మీడియాలో ఆరోగ్యసేతు యాప్ నకిలీ లింకులు
- క్లిక్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరికలు
- అధికారిక డేటాను స్మార్ట్ఫోన్లలో స్టోర్ చేయొద్దని సూచన
కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఆరోగ్యసేతుకు సంబంధించి సోషల్ మీడియాలో కనిపిస్తున్న లింకులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. అవన్నీ నకిలీవని ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని క్లిక్ చేయవద్దని సచివాలయ ఉద్యోగులను హెచ్చరించింది.
అవి పాకిస్థాన్ సైబర్ నేరగాళ్ల నుంచి వస్తున్న లింకులని, వాటిని క్లిక్ చేసి ప్రమాదంలో పడొద్దని కోరింది. ఎస్సెమ్మెస్, వాట్సాప్ ద్వారా లింకులను పంపించి ప్రభుత్వ ఉద్యోగుల స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసేందుకు నేరగాళ్లు కుట్ర చేస్తున్నారని పేర్కొంది. కాబట్టి ఉద్యోగులు తమ ఫోన్లను చాలా జాగ్రత్తగా వినియోగించాలని, అధికారిక డేటాను స్మార్ట్ఫోన్లలో స్టోర్ చేయవద్దని సూచించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన మునిసిపల్ శాఖ కార్యదర్శి పి.సుదర్శన్‌రెడ్డి తమ శాఖ ఉద్యోగులకు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.