Andhra Pradesh: ఏపీలోనూ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు.. 5 వేలకు చేరువలో బాధితులు!
- నిన్న ఒక్క రోజే వెలుగు చూసిన 154 కేసులు
- ఇప్పటి వరకు 75 మంది మృతి
- 24 గంటల వ్యవధిలో 14,246 మంది నమూనాల పరీక్ష
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 154 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 125 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా, మిగతా వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,813కు చేరుకుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 75 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,387 మంది కోలుకోగా, 1,381 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఇక, విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిలో 132 మంది మహమ్మారి బారినపడగా, 126 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో 838 మందికి వైరస్ సంక్రమించింది. వీరిలో 520 మంది చికిత్స పొందుతుండగా, తాజాగా 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 14,246 మంది నమూనాలను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.