Kurnool District: ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చున్న చిరుత.. అదిరిపోయిన ప్రయాణికులు
- రోడ్లపైకి వచ్చి యథేచ్చగా సంచరిస్తున్న వన్యప్రాణులు
- తెలుగు గంగ కాల్వ దాటిన వెంటనే రోడ్డుపై చిరుత తిష్ట
- చాలాసేపటి తర్వాత కదిలిన వైనం
లాక్డౌన్ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారుతుండడంతో అటవీ జంతువులు యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి సంచరిస్తున్నాయి. ముఖ్యంగా చిరుతలు రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఈ చిరుతలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
తాజాగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో నడిరోడ్డుపై సోమవారం రాత్రి ఓ చిరుత తిష్టవేసింది. దుర్గమ్మ గుడి వద్ద తెలుగు గంగ కాల్వ వంతెన దాటిన వెంటనే రోడ్డుపై కూర్చున్న చిరుతను చూసిన వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఎక్కడికక్కడ ఆగిపోయారు. చాలాసేపటి తర్వాత చిరుత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు.