Mamata Banerjee: బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్ పై కన్నేసిన అమిత్ షా!

Amit Shah Virtuval Rally in Westbengal Today

  • బీహార్ లో నిర్వహించిన వర్చువల్ ర్యాలీ విజయవంతం
  • నేడు పశ్చిమ బెంగాల్ లో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం
  • భారీ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర బీజేపీ వర్గాలు
  • ఏం సాధించడం కోసమని ప్రశ్నించిన మమతా బెనర్జీ

బీహార్ లో వర్చువల్ మీటింగ్ విజయవంతం అయిన తరువాత కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా కన్ను పశ్చిమ బెంగాల్ పై పడింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుండగా, ఇప్పటి నుంచే అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ దిశగా నేటి ఉదయం 11 గంటలకు ఆయన వివిధ రకాల సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్ లోని బీజేపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.

"ఇది రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మార్చే ఓ ర్యాలీ వంటిది" అని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఇది ఆన్ లైన్ లో జరుగుతున్న మెగా ఈవెంట్ అని, వర్చువల్ సమావేశాల్లో వరల్డ్ రికార్డును సృష్టిస్తుందని ఆయన అన్నారు. కాగా బీహార్ లో రాష్ట్రవ్యాప్తంగా 70 వేలకు పైగా ఎల్ఈడీలను ఏర్పాటు చేశామని, మొత్తం 43 లక్షల మందికి పైగా ప్రజలు అమిత్ షా ప్రసంగాన్ని వీక్షించారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక పశ్చిమ బెంగాల్ లో ఎన్ని ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారన్న విషయాన్ని దిలీప్ ఘోష్ తెలియజేయ లేదు.

ఇక ఈ సమావేశంపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దీంతో బీజేపీ ఏం ఆశిస్తుందో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు. ఇదే తరహాలో తాము జూలై 21న భారీ ర్యాలీని అమరవీరుల స్మృత్యర్థం నిర్వహించనున్నామని అన్నారు. ఇదిలావుండగా, తన వర్చువల్ ర్యాలీలో అమిత్ షా, పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మమతా బెనర్జీపై నిప్పులు చెరగనున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్యా గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తామిద్దరి మధ్యా కరోనాపై చర్చ జరిగిందని, తాను అమిత్ షా ను గట్టిగా నిలదీశానని మమతా బెనర్జీ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన తరువాత వారిద్దరి మధ్యా హీట్ మరింతగా పెరిగింది.

  • Loading...

More Telugu News