West Indies: హమ్మయ్య... క్రికెట్ మళ్లీ మొదలవుతోంది... ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు
- మూడ్నెల్లుగా క్రికెట్ లేక ఉసూరుమంటున్న అభిమానులు
- జూలై 8 నుంచి ఇంగ్లాండ్, విండీస్ మధ్య టెస్ట్ సిరీస్
- విండీస్ ఆటగాళ్లకు 14 రోజుల క్వారంటైన్!
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచమే స్తంభించిన వేళ క్రికెట్ ఆట కూడా నిలిచిపోయింది. ఇన్నాళ్లు క్రికెట్ అభిమానులు మ్యాచ్ లు లేక నిరుత్సాహపడిపోయారు. ఇప్పుడు ఫ్యాన్స్ కు సిసలైన మజా అందించేందుకు క్రికెట్ మళ్లీ వస్తోంది. ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు లండన్ చేరుకుంది. వాస్తవానికి ఈ సిరీస్ జూన్ లోనే మొదలవ్వాల్సి ఉండగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 8 నుంచి షురూ కానుంది. ఈ లోపు ఆటగాళ్లకు కరోనా వైద్య పరీక్షలు, విదేశాల నుంచి వచ్చినందున 14 రోజుల ముందస్తు క్వారంటైన్ వంటి చర్యలు తీసుకోనున్నారు.
కాగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు టెస్టులకు ఓవల్, ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్ మైదానాలు వేదికగా నిలుస్తున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో స్టేడియాల్లో ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ద్వారా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు క్రికెట్ లో ప్రవేశించనున్నాయి. బంతికి ఉమ్మిపూయడం, వికెట్లు పడినప్పుడు చేతులు కలపడం (హై-ఫై) వంటి చర్యలకు ఇకపై చోటు ఉండకపోవచ్చు.