Telangana: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకూ సిద్ధమైన టీఎస్ఆర్టీసీ!
- ఆర్టీసీపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
- ఆయా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశం
- తొలుత ఏపీలోని పలు నగరాలకు బస్సు సర్వీసులు
ప్రస్తుతం జిల్లా సర్వీసులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులకూ సిద్ధమైంది. పొరుగు రాష్ట్రాల అనుమతితో ఆయా రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించింది. నిన్న రాత్రి ప్రగతి భవన్లో ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఆయా రాష్ట్రాలతో చర్చలు జరిపే బాధ్యతను ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం అప్పగించారు. దీంతో నేడు ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శులతో సోమేశ్ కుమార్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా బస్సులు ఎప్పటి నుంచి నడపాలి? ఎన్ని సర్వీసులు అందుబాటులోకి తేవాలి? అన్న దానిపై చర్చిస్తారు.
అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో రూట్ టు రూట్ పద్ధతిని పాటించాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఓ రాష్ట్రం నుంచి ఏ రూట్లో ఎన్ని బస్సులు వస్తే అదే రూట్లో టీఎస్ ఆర్టీసీ కూడా అన్నే బస్సులు నడుపుతుంది. బస్సు సర్వీసుల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ఇప్పటికే లేఖ రాసింది. కాబట్టి తొలుత ఏపీలోని ముఖ్యనగరాలకు బస్సులు నడుపనున్నట్టు తెలుస్తోంది.