Chandrababu: వేధింపులకు తట్టుకోలేక పార్టీ మారుతున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు
- ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదు
- భయపడి పార్టీ మారడం పిరికితనం
- పార్టీ మారిన వారంతా కనుమరుగైపోయారు
టీడీపీ నేతలు వరుసగా వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరు వెళ్లిపోయినా టీడీపీకి ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీని వీడుతున్నారని చెప్పారు. అధికార పార్టీ వేధింపులకు భయపడే పార్టీ మారుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయుల్లో ఉన్న నేతలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భయపడో, ప్రలోభాల కోసమో పార్టీ మారడం పిరికితనమని చంద్రబాబు అన్నారు. పార్టీ మారిన వారంతా కనుమరుగైపోయారనే విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. రాబోయే 40 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని... ఆ బాధ్యత, ఓపిక తనకు ఉన్నాయని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.