Sri Lanka: తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీలంక.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా!
- శ్రీలంక పార్లమెంటు ఎన్నికలపై కరోనా ప్రభావం
- ఆగస్ట్ 5న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం
- ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ఏకాభిప్రాయం
కరోనా వైరస్ ప్రభావం ఎప్పటికి తగ్గుతుందో ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల నాటికి దాని దూకుడు కొంత మేర తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెపుతున్నారు. మరోవైపు, కరోనా కారణంగా శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. తాజాగా శ్రీలంక జాతీయ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5న పార్లమెంటు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం ఛైర్మన్ మహీంద్ర దేశ్ ప్రియ మాట్లాడుతూ, కరోనా కారణంగా ఎన్నికలను ఇప్పటి వరకు నిర్వహించలేకపోయామని... మహమ్మారిని నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. జూన్ 5న జరగాల్సిన ఎన్నికలు ఆగస్టు 5న జరుగుతాయని వెల్లడించారు. జాతీయ ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారని చెప్పారు.