Devineni Uma: 137 బీసీ కులాలు అడుగుతున్నాయి.. సమాధానం చెప్పండి జగన్ గారూ: దేవినేని ఉమ
- అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
- రైతుల మాటలు వినపడుతున్నాయా అని దేవినేని ప్రశ్న
- 'చేదోడు' పథకంపై కూడా విమర్శలు
అప్పుల బాధను తట్టుకోలేక ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. 'బతకాలని ఉంది, వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పులపాలయ్యా. తాగుబోతును, తిరుగుబోతును కాదు. సాగు కోసమే అప్పు చేశా' అంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... రైతులు, కౌలు రైతుల మాటలు తాడేపల్లిలోని రాజప్రాసాదానికి వినపడుతున్నాయా చెప్పండి జగన్ గారూ? అని ఆయన ప్రశ్నించారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన 'చేదోడు' పథకంపై కూడా ఉమ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికీ లబ్ధి అని హామీలు గుప్పించారని... ఇప్పుడేమో 'షాపులు ఉంటేనే' అని మాట మార్చారని విమర్శించారు. కార్పొరేషన్లను రద్దు చేశారని... లక్ష రూపాయల రాయితీని రూ. 10 వేలకు కుదించారని దుయ్యబట్టారు. నామమాత్రంగా ఉన్న ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ ను కూడా తరలించారని అన్నారు. ఇదేమి 'చేదోడు' అని 137 బీసీ కులాలు అడుగుతున్నాయని... జగన్ గారూ సమాధానం చెప్పండి అని డిమాండ్ చేశారు.