Low Pressure: బలపడనున్న అల్పపీడనం... కోస్తాలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు
- కోస్తాలో రేపు కూడా భారీ వర్షాలే!
- తీరం వెంబడి 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ రాగల 48 గంటల్లో మరింత బలం పుంజుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనంతో ఇవాళ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
అటు, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు కూడా రాష్ట్రంలో వర్షాలపై స్పందించారు. పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని, తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇవాళ, రేపు కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని కన్నబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 13న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వివరించారు.
ఈ మూడ్రోజుల పాటు వర్షపాతం సమయాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు. రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు.