Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో మరో కలకలం.. కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీ మాయం!
- 9న ఆసుపత్రిలో చేరిన కరోనా పేషెంట్ రషీద్
- నిన్న ఉదయం 4 గంటలకు మృతి
- మార్చురీలో మాయమైన రషీద్ మృతదేహం
కరోనా మహమ్మారి తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఎంతో మంది కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రి... కొన్ని విషయాల్లో వివాదాస్పదం కూడా అవుతోంది. తాజాగా గాంధీలో కరోనా రోగి శవం మాయం కావడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే నగరంలోని మెహదీపట్నంకు చెందిన రషీద్ ఖాన్ అనే ఓ వ్యక్తి నిన్న కరోనాతో మృతి చెందాడు. ఈ నెల 9న కరోనాతో అతను గాంధీలో చేరాడు. నిన్న ఉదయం 4 గంటలకు చనిపోయాడు. ఆయన చనిపోయినట్టు బంధువులకు ఆసుపత్రి అధికారులు సమాచారం ఇచ్చారు.
దీంతో, డెడ్ బాడీని తీసుకెళ్లడానికి నిన్న సాయంత్రం బంధువులు ఆసుపత్రికి వచ్చారు. అయితే మార్చురీలో ఉండాల్సిన మృతదేహం మాయమైంది. దీంతో బంధువులు షాక్ కు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు ఇంత వరకు వివరణ ఇవ్వలేదు. శవం మాయం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.