Atchannaidu: యర్రంనాయుడు కుటుంబాన్ని రాజకీయంగా మట్టుబెట్టేందుకు కుట్ర: ఆలపాటి రాజా
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నను అరెస్ట్ చేశారు
- బీసీ కులాలకు యర్రన్నాయుడి కుటుంబం మార్గదర్శకంగా ఉంది
- ఈఎస్ఐ స్కామ్ లో రికార్డులు తారుమారు చేశారు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయరా? అని వైసీపీ నేతలు అంటుంటే... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సంర్బంగా టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ పాలనకు ఇది పరాకాష్ఠ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యర్రంనాయుడు కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని... రాష్ట్రంలోని బీసీ కులాలకు వారు మార్గదర్శకులుగా ఉన్నారని చెప్పారు.
యర్రంనాయుడు కుటుంబాన్ని రాజకీయంగా మట్టుబెట్టాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆలపాటి మండిపడ్డారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని... సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను అచ్చెన్న ప్రశ్నిస్తారనే భయంతోనే అరెస్ట్ చేయించారని దుయ్యబట్టారు. ఈఎస్ఐ స్కామ్ లో రికార్డులను తారుమారు చేసి, ఆ బురదను అచ్చెన్నకు అంటించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.