Daggubati Purandeswari: సరైన ఆధారాలుంటే శిక్ష అనుభవించక తప్పదు: అచ్చెన్నాయుడి అరెస్ట్ పై పురందేశ్వరి వ్యాఖ్యలు
- అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన ఏసీబీ
- సరైన ఆధారాలుంటే విచారణ జరగాల్సిందేనన్న పురందేశ్వరి
- అవినీతి ప్రక్షాళన ప్రజాస్వామ్యంలో తక్షణ అవసరమంటూ వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అవినీతికి పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందేనని, ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్రపై సరైన ఆధారాలు ఉంటే విచారణ జరగాల్సిందేనని అన్నారు.
పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులను ఎవరూ తప్పుబట్టబోరని స్పష్టం చేశారు. అవినీతి ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యంలో తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. గతంలో వైసీపీ అధికారంలో లేనప్పుడు 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అంటూ ఓ పెద్ద పుస్తకం వేశారని, అయితే అందులోని అంశాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. ఆ పుస్తకంలో జీవోలతో సహా అవినీతి ఆరోపణలు చేశారని, ఇప్పుడదే వైసీపీ అధికారంలో ఉందని, చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు.