Ayyanna Patrudu: ఈఎస్ఐ కేంద్ర సంస్థ అయినప్పుడు ఇందులో మంత్రుల బాధ్యత ఏముంటుంది?: అయ్యన్నపాత్రుడు
- రాష్ట్ర సర్కారు ఓ పరిశీలకుడిగానే వ్యవహరిస్తుందని వెల్లడి
- ఈఎస్ఐ లావాదేవీల్లో మంత్రుల ప్రమేయం ఉండదని స్పష్టీకరణ
- ఇది కక్ష సాధింపు చర్యేనన్న అయ్యన్న
ఈఎస్ఐ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈఎస్ఐ అనేది కేంద్ర సంస్థ అని, ఇందులో మంత్రుల బాధ్యత ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ వ్యవహారాల్లో స్థానికంగా పర్యవేక్షణ మాత్రమే చేస్తుందని, ఈఎస్ఐల కార్యకలాపాల్లో మంత్రుల పాత్ర ఏమీ ఉండదని అయ్యన్న స్పష్టం చేశారు.
దీనికి ఈఎస్ఐ డైరెక్టరే బాధ్యత వహిస్తాడని, తెలంగాణలోనూ ఇలాంటిదే జరిగితే అక్కడ కేవలం ఈఎస్ఐ అధికారులను బాధ్యులుగా చూపారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏపీ సర్కారు విడుదల చేసిన ప్రకటనలో నలుగురు డాక్టర్లను బాధ్యులుగా చూపారే తప్ప, ఆ స్టేట్ మెంటులో అచ్చెన్నాయుడి పేరు లేదని అన్నారు. ఏ విధంగా చూసినా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా, అచ్చెన్నాయుడి అరెస్ట్ నేపథ్యంలో మరో మాజీ మంత్రికి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని, ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.