Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం, జీఎంఆర్ ల మధ్య ఒప్పందం
- భోగాపురంలో అన్ని హంగులతో విమానాశ్రయం
- సీఎం జగన్ సమక్షంలో సంతకాలు
- ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేసిన జీఎంఆర్ ప్రతినిధులు
విజయనగరం జిల్లా, భోగాపురంలో అన్ని హంగులతో విమానాశ్రయం నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్ గ్రూపు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానిస్తూ, భోగాపురం విమానాశ్రయం సాకారం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టును విశాఖ నగరంతో అనుసంధానం చేస్తామని, భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ నగరానికి సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అటు, జీఎంఆర్ ప్రతినిధులు కూడా ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలు తీసుకుంటామని వెల్లడించారు.