Yousuf Raza Gilani: పాక్ లో నేతలను వెంటాడుతున్న కరోనా... మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి పాజిటివ్

Pakistan former prime minister Yousuf Raza Gilani tested corona positive

  • పాకిస్థాన్ లో కరోనా విజృంభణ
  • ఇప్పటికే అనేకమంది రాజకీయ నేతలకు పాజిటివ్
  • తన తండ్రికి కూడా కరోనా సోకిందన్న గిలానీ తనయుడు

పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి రాజకీయనేతల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా కరోనా బారినపడ్డారు. గిలానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ వెల్లడించారు. దీనిపై కాసిమ్ గిలానీ పాక్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

"ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకి కృతజ్ఞతలు. మా నాన్న జీవితాన్ని మీరు విజయవంతంగా ప్రమాదంలోకి నెట్టగలిగారు. ఆయన కరోనా పరీక్ష పాజిటివ్ అని వచ్చింది" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

పాక్ లో రాజకీయ నేతలను కరోనా వెంటాడుతోందనే చెప్పాలి. ఇటీవల పీటీఐ, పీఎంఎల్ ఎన్ పార్టీల నేతల్లో చాలామంది కరోనా బారినపడ్డారు. ప్రధాన విపక్ష నేత, పీఎంఎల్ ఎన్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, రైల్వే మంత్రి షేక్ రషీద్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరారు. పాకిస్థాన్ లో మొట్టమొదటి కేసు ఫిబ్రవరి 26న వెలుగు చూడగా, అప్పటి నుంచి ఇప్పటివరకు 1,32,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,551 మంది మృత్యువాత పడగా, 50 వేల మందికి పైగా కోలుకున్నారు.

  • Loading...

More Telugu News