CAIT: మార్కెట్లను మూసేస్తేనే కట్టడి చేయచ్చంటున్న ఢిల్లీ వ్యాపారులు!
- కరోనా నియంత్రణపై సర్వే నిర్వహించిన సీఏఐటీ
- సర్వేలో పాల్గొన్న ట్రేడ్ అసోసియేషన్లు, ప్రముఖ వ్యాపారులు
- వ్యాపారవేత్తలతో రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఏఐటీ
ఢిల్లీలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో... మార్కెట్లను మూసేయడమే మంచిదని 88 శాతం మంది వ్యాపారులు అభిప్రాయపడ్డారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్వహించిన సర్వేలో వ్యాపారులు ఏమనుకుంటున్నారో వెల్లడైంది. ఈ సర్వేలో 2610 ట్రేడ్ అసోసియేషన్లు, ప్రముఖ వ్యాపారుల అభిప్రాయాలను స్వీకరించారు. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇవే.
- కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని 99.4 శాతం మంది అభిప్రాయపడ్డారు.
- మార్కెట్లను తెరిస్తే... మార్కెట్ల ద్వారా వైరస్ విస్తరిస్తుందని 92.8 శాతం మంది తెలిపారు.
- కరోనా డిమాండ్ కు తగ్గట్టు ఢిల్లీలో వైద్య సదుపాయాలు లేవని 92.7 శాతం మంది చెప్పారు.
- మార్కెట్లను మూసేయడం ద్వారా కరోనా విస్తరణను కట్టడి చేయవచ్చని 88.1 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరోవైపు రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఏఐటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. సమావేశంలో సర్వేలో వెల్లడైన అంశాలపై చర్చ జరిపి, తుది నిర్ణయాలను మీడియాతో పంచుకోనుంది. వీటిని ప్రభుత్వానికి కూడా సిఫారసు చేయనుంది. ప్రభుత్వాలతో సహకరించుకుంటూ, కరోనాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సీఏఐటీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్ చెప్పారు.