Sabarimala: నేడు తెరచుకోనున్న అయ్యప్ప దేవాలయం... భక్తుల రాకపై మాత్రం నిషేధం!
- నేటి నుంచి నెలవారీ పూజలు
- భక్తులు రావద్దన్న దేవస్థానం బోర్డు
- కరోనా భయాలే కారణం
కేరళలోని శబరిమల కొండలపై కొలువైన అయ్యప్ప దేవాలయం నేడు తెరచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం ఆలయాన్ని ఐదు రోజుల పాటు తెరచి వుంచనున్నారు. అయితే, కరోనా వ్యాప్తి దృష్ట్యా, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశం లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్ప దర్శనానికి భక్తులు రావద్దని అధికారులు కోరారు.
కేరళలో కరోనా వ్యాప్తి కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తే, తిరిగి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున, ప్రస్తుతానికి భక్తులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితులను సమీక్షించి, వచ్చే నెలలో ఆలయాన్ని తెరిచే సమయంలో భక్తుల ప్రవేశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వామివారికి జరిగే పూజలను అర్చకులే ఏకాంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.