Tirumala-Nizamabad: ప్రయాణికుల్లేక బోసిపోతున్న రైళ్లు.. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీల్లో 40 మందే!
- జూన్ 1 నుంచి ప్రారంభమైన రైళ్ల సర్వీసులు
- తొలి రోజుల్లో కిక్కిరిసిన రైళ్లు
- రెండు వారాలు తిరిగే సరికి పూర్తిగా మారిన పరిస్థితులు
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రైలు ప్రయాణాలు పునఃప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించిన తర్వాత ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బుకింగ్ ప్రారంభమైన కాసేపటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రయాణాలు ప్రారంభమైన రోజున ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
అయితే, రెండు వారాలు గడిచే సరికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయాణికుల్లేక రైళ్లు, రైల్వే స్టేషన్లు బోసిపోతున్నాయి. ఈ నెల 1 నుంచి తిరుపతి-నిజామాబాద్ మధ్య నడుస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి బయలుదేరిన ఈ రైలులో 8 ఏసీ బోగీలు ఉండగా 40 మంది ప్రయాణికులు మాత్రమే అందులో ప్రయాణించారు. సికింద్రాబాద్ స్టేషన్కు రైలు చేరుకునే సరికి వారిలో ఏడుగురు మాత్రమే మిగలడం గమనార్హం. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోతుండడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు.