China: బీజింగ్ లో కరోనా సామూహిక పరీక్షలు.. వణుకుతున్న ప్రజలు!
- బీజింగ్ లో పెరుగుతున్న కొత్త కేసులు
- దేశవ్యాప్తంగా ప్రయాణ హెచ్చరికలు జారీ
- బీజింగ్ లోని హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి
- బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు
చైనా రాజధాని బీజింగ్ లో కొత్తగా భారీ ఎత్తున కరోనా కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం సామూహిక పరీక్షలకు ఆదేశించడంతో, ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణ హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈ మహమ్మారి వైరస్ చైనాలో నియంత్రణలోకి వచ్చినట్టే వచ్చి, తిరిగి ఇప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తోంది.
లాక్ డౌన్ నిబంధనలను చైనాలో పకడ్బందీగా అమలు చేయడంతో కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో నిబంధనలను సడలించగా, ఇప్పుడు రోజువారీ కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. కాగా, తాజాగా వస్తున్న కేసులు, బీజింగ్ లోని ఓ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ తో సంబంధమున్నవేనని అధికారులు గుర్తించారు. దీంతో మార్కెట్ మొత్తాన్ని మూసివేసి, తదుపరి చర్యలను అధికారులు ప్రకటించారు.
ఆదివారం నాడు కొత్తగా చైనాలో 57 కేసులు వచ్చాయని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించగా, అందులో 36 బీజింగ్ లోని క్సిన్ఫాడీ మార్కెట్ తో లింక్ ఉన్నవేనని తెలుస్తోంది. మిగతా 19 కేసులూ విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారివేనని అధికారులు వెల్లడించారు.
ఇక్కడి మాంసం వ్యాపారులు, మార్కెట్ మూసివేయడంపై స్పందిస్తూ, ఈ మహమ్మారి నిజంగా భయపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, సాధారణంగా వచ్చే కస్టమర్లతో పోలిస్తే, తక్కువ సంఖ్యలోనే వస్తున్నారని, తమ బిజినెస్ సాగడం లేదని వారు వాపోయారు. ప్రజలు సైతం వైరస్ కారణంగా వణికిపోతున్నారని, బయటకు రావడానికే జంకుతున్నారని అన్నారు.