Sachin Tendulkar: నాడు సుశాంత్ బ్యాటింగ్ చూసి "ఎవరా అబ్బాయి?" అంటూ ఆరా తీసిన సచిన్!
- ధోనీ బయోపిక్ కోసం మోరె వద్ద సుశాంత్ ట్రైనింగ్
- సుశాంత్ ఆటతీరుకు అచ్చెరువొందిన సచిన్
- క్రికెట్ లోకి వచ్చినా రాణిస్తాడని కితాబు
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్ నే కాదు భారత క్రికెట్ రంగాన్ని కూడా ఎంతో విషాదానికి గురిచేసింది. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా వచ్చిన ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీలో సుశాంత్ హీరోగా నటించడమే అందుకు కారణం. ఆ సినిమాలో దాదాపు ధోనీలానే కనిపించిన సుశాంత్ క్రికెట్ వర్గాలను కూడా మెప్పించాడు. అంతటి ప్రతిభావంతుడు ఇప్పుడు అనూహ్యరీతిలో బలవన్మరణం చెందడం పట్ల క్రికెటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె కూడా సుశాంత్ మృతితో విషాదానికి లోనయ్యాడు. ధోనీ బయోపిక్ లో నటించేందుకు సుశాంత్ కు క్రికెట్ శిక్షణ అవసరం కాగా, చిత్రబృందం అతడిని కిరణ్ మోరె వద్దకు పంపింది. ముంబయిలోని బాంద్రా బీకేసీ స్టేడియంలో మోరె ఆధ్వర్యంలో సుశాంత్ క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఉదంతాన్ని కిరణ్ మోరె తాజాగా వెల్లడించాడు.
"ధోనీలా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు సుశాంత్ ను నా వద్దకు పంపారు. ఒకరోజు ప్రాక్టీసు జరుగుతుంటే సచిన్ టెండూల్కర్ కూడా స్టేడియానికి వచ్చాడు. అప్పుడు సుశాంత్ హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. గ్యాలరీ నుంచి ఇదంతా చూస్తున్న సచిన్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. "ఎవరా అబ్బాయి...? చాలా బాగా ఆడుతున్నాడు" అని అడిగాడు. దాంతో, సుశాంత్ డీటెయిల్స్ చెప్పాను. ధోనీ బయోపిక్ లో నటిస్తోంది అతడేనని వెల్లడించాను. మరింత విస్మయానికి గురైన సచిన్... అతను క్రికెట్ రంగంలోకి వచ్చినా బాగా రాణించగలడని, చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని కితాబిచ్చాడు" అంటూ మోరె నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.