Gadikota Srikanth Reddy: అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు లేకుంటేనే బెటర్.. దయచేసి ప్రతిపక్షం అర్థం చేసుకోవాలి: శ్రీకాంత్ రెడ్డి
- కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి
- బడ్జెట్ ఆమోదం వరకే సమావేశాలను పరిమితం చేయాలనుకుంటున్నాం
- రఘురామకృష్ణంరాజు సొంత అజెండాను పక్కన పెట్టాలి
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ సమావేశాల్లో కేవలం గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ఆమోదం వరకే సమావేశాలను పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాజకీయ పరమైన చర్చలు లేకుంటేనే బెటర్ అని... ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని కోరారు. కరోనా నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, సమావేశాలను నిర్వహించనున్నామని చెప్పారు. శాసనసభ, మండలిని పూర్తిగా శానిటైజ్ చేశామని తెలిపారు.
కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే సమావేశాలకు రావాలని, వారి వెంట వ్యక్తిగత సిబ్బందికి అనుమతి లేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మంత్రుల వెంట ఇద్దరు వ్యక్తిగత సిబ్బందిని అనుమతిస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్వాబ్ టెస్ట్ కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. వయసు మళ్లిన వారికి పీపీఈ కిట్లను అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ... ఆయన తన వ్యక్తిగత అజెండాను పక్కన పెట్టాలని అన్నారు. వరుస సమీక్షలతో జగన్ బిజీగా ఉన్నారని... మధ్యలో వెళ్లి ఆయనను కలవడం సాధ్యమా? అని ప్రశ్నించారు. వైసీపీ గుర్తు మీద గెలిచి పార్టీ మారిన వారి పరిస్థితి ఏమిటో గత ఎన్నికల్లోనే చూశామని అన్నారు.