newzealand: కరోనారహిత దేశంగా ప్రకటించుకున్న కొన్ని రోజులకే న్యూజిలాండ్‌లో మళ్లీ కేసులు
- కరోనాపై విజయం సాధించామని వారం క్రితమే ప్రకటన
- తాజాగా రెండు కేసులు వెలుగులోకి
- బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా
కొవిడ్-19ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోతోన్న వేళ న్యూజిలాండ్ ఆ వైరస్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తమ దేశంలో నమోదైన చిట్టచివరి కరోనా వైరస్ బాధిత మహిళ కూడా కోలుకుందని ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటన చేసిన వారం రోజులకే ఆ దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు వెలుగుచూడడం గమనార్హం.
విదేశాల నుంచి వస్తోన్న వారి వల్లే మళ్లీ న్యూజిలాండ్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ నుంచి తమ దేశానికి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. సుమారు 24 రోజుల అనంతరం ఆ దేశంలో మళ్లీ తొలిసారి వైరస్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం న్యూజిలాండ్ లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తేసింది. భవిష్యత్తులో తమ దేశంలో కొత్తగా కరోనా కేసులు మళ్లీ నమోదయ్యే అవకాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని జెసిండా ప్రజలను హెచ్చరించారు.