Prakash Raj: నేను ఎంతో లోతైన గాయాలు చవిచూశా... చిన్నవాడైన సుశాంత్ రాజ్ పుత్ భరించలేకపోయాడు: ప్రకాశ్ రాజ్ ఆవేదన
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై ప్రకాశ్ రాజ్ ఆవేదన
- బాధల నుంచి పాఠాలు నేర్చుకోవాలని వెల్లడి
- 'బంధుప్రీతి' మధ్యే నెట్టుకొస్తున్నానంటూ వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలను సుశాంత్ భరించలేకపోయాడని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉండే 'బంధుప్రీతి' (నెపోటిజం) మధ్యే తాను నెట్టుకొస్తున్నానని, కానీ చిన్నవాడైన సుశాంత్ తట్టుకోలేకపోయాడని వివరించారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో లోతైన గాయాలు తగిలాయని, వయసులో చిన్నవాడైన సుశాంత్ కు అలాంటి గాయాలను ఓర్చుకునే శక్తి లేకపోయిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుంటే తప్పకుండా నిలబడగలమని, మన కలల్ని సాకారం చేసుకోగలమని వివరించారు.
కాగా, సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొన్నాళ్ల కిందట సుశాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇండస్ట్రీలో 'బంధుప్రీతి' ఎక్కువగా ఉందని, ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహించకపోతే వారు ఎలా ఎదుగుతారని సుశాంత్ 'ఐఫా' అవార్డుల సందర్భంగా వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో బాలీవుడ్ పై తీవ్ర ఆరోపణ చేశారు. తనను బాలీవుడ్ లో జరిగే పార్టీలకు ఎవరూ పిలవడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీ నుంచి తనను వెలివేసిన ఫీలింగ్ కలుగుతోందని అన్నారు.