Chandrababu: అనారోగ్యంగా ఉంటే ఉరిశిక్ష కూడా అమలు చేయరు... అచ్చెన్నకు మళ్లీ ఆపరేషన్ చేసే పరిస్థితి తెచ్చారు: చంద్రబాబు
- బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్న చంద్రబాబు
- సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆగ్రహం
- అచ్చెన్న పట్ల అమానవీయంగా ప్రవర్తించారని వెల్లడి
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. ఓవైపు కరోనా విలయం సృష్టిస్తుంటే, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక, అంశాలవారీగా వైసీపీ సర్కారును తూర్పారబట్టిన చంద్రబాబు... అచ్చెన్నాయుడు అంశంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనారోగ్యంగా ఉంటే ఉరిశిక్ష కూడా వేయరని, కానీ అచ్చెన్నాయుడు పట్ల అమానవీయంగా ప్రవర్తించి ఆయనకు మళ్లీ శస్త్రచికిత్స చేసే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. వైసీపీలో చేరాలని అచ్చెన్నాయుడ్ని ప్రలోభాలకు గురిచేసి, ఆయన లొంగకపోయే సరికి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తనకు ఆపరేషన్ జరిగిందని చెప్పినా అచ్చెన్న పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.