Narendra Modi: నలుగురు కేంద్ర మంత్రులు, ఆర్మీ చీఫ్ తో రాత్రి ప్రధాని అత్యవసర సమావేశం!

Narendra Modi Emergency Meeting With Central Ministers

  • రాత్రి 10 గంటలకు మొదలైన సమావేశం
  • పాల్గొన్న అమిత్ షా, రాజ్ నాథ్, జై శంకర్, నిర్మల
  • చైనాకు దీటైన జవాబు ఇవ్వడానికి సలహాలు కోరిన మోదీ

భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20 మంది మరణించిన విషయం తెలియగానే, ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆర్మీ చీఫ్ నరవాణే హాజరయ్యారు. రాత్రి 10 గంటలకు సమావేశం ప్రారంభమైంది. లడక్ సమీపంలోని గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాలను వీరు చర్చించారు.

కాగా, నిన్న ఉదయం ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు చనిపోయారన్న వార్తలు రాగా, ఆ తరువాత మృతుల సంఖ్య 20కి పెరిగింది. చైనాకు చెందిన 43 మంది జవాన్లు మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగిందని తెలుస్తోంది. ఇరు దేశాల సైనికుల మధ్యా కాల్పులు జరగలేదని, కానీ బాహాబాహీ జరిగిందని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారని, పరస్పరం రాళ్లు రువ్వుకున్నారని ఆర్మీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మొత్తం పరిస్థితిపై చర్చించిన ప్రధాని నరేంద్ర మోదీ, సరిహద్దుల్లో శాంతికి కట్టుబడివున్నామని చెబుతూనే, చైనాకు దీటైన జవాబు ఇచ్చే విషయమై సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ అత్యవసర సమావేశం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News