India: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం
- ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలు
- భారత్‌కు అనుకూలంగా 184 దేశాల ఓటు
- 2021-22 కాలానికి గాను ఎన్నిక
నిన్న జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఓటింగులో పాల్గొనగా, భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటేశాయి. ఫలితంగా మరోసారి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని కోరుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్న భారతదేశానికి.. 2021-22 కాలానికి కౌన్సిల్ లోకి ప్రవేశం పొందడం కీలకం.
భారత్ ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. 2021-22 కాలానికి భారత్‌ను ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నట్టు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. కాగా, భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. అలాగే భారత్ గతంలో 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992, 2011-12లలో విజయం సాధించింది.