BSNL: 4 జీ అప్ గ్రేడ్ లేకున్నా నష్టం లేదు... చైనా పరికరాలు మాత్రం వాడవద్దు: బీఎస్ఎన్ఎల్ కు కేంద్రం ఆదేశాలు!
- 4 జీ సేవల విస్తరణలో బీఎస్ఎన్ఎల్
- ఇప్పటికే చైనాకు చెందిన జెడ్ టీఈతో డీల్
- అవసరం లేదన్న కేంద్రం
4జీ తరంగాల సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు చైనాకు చెందిన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటున్న ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కు, ఇరు దేశాల మధ్యా నెలకొన్న తాజా పరిస్థితులు అడ్డంకిగా నిలిచాయి. 4జీ అప్ గ్రేడేషన్ కోసం చైనాకు చెందిన పరికరాలను వాడవద్దంటూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇదే సమయంలో మిగతా ప్రైవేటు టెలికం కంపెనీలు కూడా చైనా సంస్థలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది.
భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా తదితర సంస్థలు హువేయితో భాగస్వామ్యంతో తమ నెట్ వర్క్ లను నిర్వహిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ చైనాకు చెందిన జెడ్ టీఈతో కలిసి పనిచేస్తోంది. లడఖ్ ప్రాంతంలో చైనా జవాన్లు దాడికి దిగిన నేపథ్యంలో, కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. చైనా సంస్థలతో సంబంధాలు వద్దని, 4జీ సాంకేతికతకు అప్ గ్రేడ్ కాకున్నా నష్టం లేదని బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయని, ఓ అధికారి తెలిపారు.
కాగా, ఇప్పటికే, చైనా టెలికం నెట్ వర్క్ లు, చైనా యాప్స్ వాడటం ద్వారా సైబర్ గూఢచర్యానికి బలవుతున్నామని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడటం గమనార్హం. ఇక చైనా కంపెనీలయిన హువేయి, జడ్ టీఈలు ఇతర వ్యాపార మార్గాలను వెతుక్కోవాల్సిందేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ను హువేయి హ్యాక్ చేసిందన్న ఆరోపణలు రాగా, ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా, ఈ విషయంలో విచారణ జరిపిస్తున్నట్టు వెల్లడించింది కూడా. ప్రస్తుతం ఇండియాలో 4జీ, 5జీ నెట్ వర్క్స్ నిర్వహణలో ఒక్క చైనా కంపెనీ సహాయం కూడా లేకుండా పనిచేస్తున్నది ఒక్క రిలయన్స్ జియో మాత్రమే కావడం గమనార్హం.