France: ఇంత డ్యూటీ మా వల్ల కాదు... ఫ్రాన్స్ లో పోలీసుల వినూత్న నిరసన!
- గడచిన మూడు నెలలుగా ఒత్తిడిలో పోలీసులు
- తాజాగా నర్స్ అరెస్ట్ పై పారిస్ వాసుల ప్రదర్శనలు
- తమపై ఒత్తిడి తగ్గించాలంటూ పోలీసుల నిరసన
- హ్యాండ్ కప్స్ రోడ్డుపై ఉంచి ప్రదర్శన
ఫ్రాన్స్ ఇప్పుడు కొత్త సమస్యలో చిక్కుకుంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా గడచిన మూడు నెలలుగా విపరీతమైన ఒత్తిడిలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే విధులను బహిష్కరించడంతో ఫ్రాన్స్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు మెరుగైన పనితీరు వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, నేరస్థులకు వేయాల్సిన బేడీలను నడి రోడ్డుపై పడేసిన పోలీసులు, తమ నిరసనను తెలిపారు. తమ అంతర్గత వ్యవహారాల మంత్రి తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత ఫ్రాన్స్ లో కూడా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అసలే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, ఈ నిరసనలను అడ్డుకునేందుకు కూడా డ్యూటీలు చేయాల్సి రావడంతో, ఎంతోమంది ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు పారిస్ లో ఆందోళనకారులు మరో నిరసనను తలపెట్టారు. నిరసన ప్రదర్శనలో ఉన్న ఓ నర్సును పోలీసులు, దారుణాతి దారుణంగా వీధుల్లోకి లాక్కెళ్లారని ఆరోపిస్తూ, నిరసనలకు పిలుపునిచ్చారు.
ఆ నర్స్ తలకు రక్తం కారుతున్నప్పటికీ, స్పందించని పోలీసులు, ఆమెను రోడ్డుపై లాక్కెళుతున్న దృశ్యాలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. దీనిపై సీజీటీ యూనియన్ సైతం తీవ్రంగా స్పందించింది. ఆమె ఎముకలు విరిగిపోయాయని చెప్పడంతో, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తాజా నిరసనలకు దిగారు. ఇదే సమయంలో ఇంత డ్యూటీలు తమ వల్ల కాదంటూ పోలీసులు సైతం నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న హ్యాండ్ కప్స్ నేలపై పెట్టి, ఈ విధులు తాము చేయలేమన్నారు. ఫ్రాన్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపానికి వచ్చిన వందలాది మంది పోలీసులు, తమ వద్ద ఉన్న బేడీలను తీసి రోడ్డుపై పెట్టి, తమకు మెరుగైన పనితీరు పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేశారు.