Chandrababu: పోలీసులు ఇందుకు సహకరించడం తగదు: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
- వైసీపీ నేతలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు
- పోలీసులను పావులుగా వినియోగించుకుంటున్నారు
- ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది
టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వం ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంటే పోలీసులు ఇందుకు సహకరించడం తగదని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు తమ ప్రతీకార చర్యలకు పోలీసులను పావులుగా వినియోగించుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలీసు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. నియంతలా వ్యవహరిస్తోన్న వారి రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన చెప్పారు. తమ పార్టీ నేత అయ్యన్న పాత్రుడిపై నమోదు చేసిన కేసు ఆ కుట్రలో భాగమేనని తెలిపారు. ఏపీలో సుధాకర్, అనితా రాణి ఘటనల్లో పోలీసుల తీరును ప్రజలంతా చూశారని ఆయన అన్నారు.