Andhra Pradesh: రవాణా రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది: జగన్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ
- లాక్ డౌన్ వల్ల పలు సమస్యలను ఎదుర్కొంటున్నాం
- లేబర్ సెస్ ను మన రాష్ట్రంలోనే వసూలు చేస్తున్నారు
- ఒక త్రైమాసికానికైనా ట్యాక్స్ ను మినహాయించాలి
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పేర్కొంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల లారీ ఓనర్లు చాలా నష్టపోయారని... ఈ నేపథ్యంలో కనీసం ఒక త్రైమాసికానికైనా ట్యాక్స్ మినహాయింపును ఇప్పించాలని లేఖలో కోరారు. ఏ రాష్ట్రంలో లేని లేబర్ సెస్ ను మన రాష్ట్రంలోనే వసూలు చేస్తున్నారని... ఈ సెస్ నుంచి కూడా మినహాయింపును ఇవ్వాలని విన్నవించారు.
దేశ వ్యాప్తంగా పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగినప్పుడే లారీలకు లోడింగ్ దొరుకుతుందని... అప్పటి వరకు లోడు దొరకక లారీలు ఖాళీగానే ఉంటాయని లేఖలో పేర్కొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ల విన్నపం మేరకు కొన్ని రాష్ట్రాల్లో క్వార్టర్ ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై విచారణ చేయించి, లారీ యజమానులను ఆదుకోవాలని విన్నవించారు.